|
|
నేనేమీ చిన్నపిల్లోడిని కాదు-దేవేందర్ గౌడ్
|
తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత తూళ్ల దేవేందర్ గౌడ్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అల్లు అరవింద్‌తో సమావేశమైనట్టు చెప్పారు.
అలాగే, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుతో కూడా ఇదే విషయంపై మాట్లాడానని చెప్పారు. అంతమాత్రానా తాను పార్టీ మారుతున్నట్టు మీడియా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. తనకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదన్నారు. ఎవరో ఏదో చేసే వ్యాఖ్యలను మీడియా పెద్దదిగా చూపిస్తోందని ధ్వజమెత్తారు.
'నేనేమీ చిన్నపిల్లోడిని కాదు. ఎంతో రాజకీయ అనుభవం ఉంది. అలాగే భవిష్యత్ కూడా ఉంది. దొంగచాటుగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం నాది కాదు. ఏది ఉన్నా.. మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తా' అని దేవేందర్ గౌడ్ మీడియాకు స్పష్టం చేశారు.
అయితే, ఆయన మాటల్లో అంతరార్థం మాత్రం "కర్ర విరగదు... పాము చావదు" అన్న చందంగా ఉంది. పార్టీ మారే విషయంపైనే చర్చించేందుకు ఆయన అల్లు అరవింద్‌తో సమావేశమైనట్టు వినికిడి. ఇప్పటికే తన అభిప్రాయాన్ని పార్టీ అధినేత చిరంజీవికి వెల్లడించారని, ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న అల్లుకు కూడా ఓ మాట చెప్పాలన్న కృతజ్ఞతాభావంతోనే ఆయనతో దేవేందర్ గౌడ్ భేటీ అయినట్టు సమాచారం. |
|
|
|