|
|
తెలంగాణ విడిపోవచ్చునని నెహ్రూ ఆనాడే చెప్పారు..!
|
 |
ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనం అయిష్టంగా జరిగింది. అది ఒక ప్రయోగం. కుదరనప్పుడు ఎప్పుడైనా తెలంగాణ విడిపోవచ్చునని" జవహర్‌లాల్ నెహ్రూ ఆనాడే చెప్పారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు.
తెలంగాణ విభజనను భగవంతుడు కూడా ఆపలేడని, తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం తథ్యమని సుష్మా స్వరాజ్ అన్నారు. అంతటి వరకు తెలంగాణ ఉద్యమం పేరిట యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆమె పిలుపు నిచ్చారు.
శాంతితో కూడిన, ఆత్మహత్యల్లేని పోరాటాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసుకోవాలని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. అంతేగాకుండా రేపటి తెలంగాణ ఏర్పాటును కళ్లారా చూడటానికి తెలంగాణ ప్రజలు బతికి ఉండాలని లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ యువతకు హితవు పలికారు.
నిజాం కళాశాల మైదానంలో శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి రణభేరికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 20 నిమిషాల పాటు సుష్మా ప్రసంగించారు.
"సోదర సోదరీ మణులారా.." అంటూ తెలుగు ప్రారంభించి, తర్వాత హిందీలో మాట్లాడిన సుష్మా స్వరాజ్ ప్రసంగానికి నిజాం కళాశాల గ్రౌండ్ కరతాళధ్వనులతో మారు మ్రోగింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుపై ప్రజల ఆకాంక్షపై భాజపా అధ్యయనం చేసింది. అందుకే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు భాజపా మద్దతుగా నిలిచింది. ఇంకా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేంతవరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు |
|
|
|